ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు
కీలక డిజిటల్ ఎవిడెన్స్ దగ్ధం.. సమగ్ర విచారణకు ఆదేశాలు
హైదరాబాద్, నాంపల్లి: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సెంట్రల్ జోన్ పరిధిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు ఎవిడెన్స్‌కు సంబంధించిన కీలక కార్యాలయాల్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివిధ నేర పరిశోధన కేసులకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు, ఫైళ్లు, డిజిటల్ డేటా నిల్వ ఉంచిన విభాగాలే మంటల్లో పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు గుర్తించారు. స్టోర్ చేసి ఉంచిన మెటీరియల్ మొత్తం కాలిపోయి బూడిదైనట్టు సమాచారం.
అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. అయితే, అసలు ఏఏ వస్తువులు దగ్ధమయ్యాయి, ఎంతమేర నష్టం జరిగింది అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో కంప్యూటర్లు, డిజిటల్ ఎవిడెన్స్‌కు సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయని డీసీపీ తెలిపారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైళ్లు, ఎవిడెన్స్ ల్యాబొరేటరీ ఆపరేషన్లు ఈ కార్యాలయం నుంచే నిర్వహించేవారని చెప్పారు. ఈ అగ్నిప్రమాదం అనేక కీలక కేసులపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమై ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది. తీవ్ర ప్రయత్నాల అనంతరం మంటలు నియంత్రణలోకి వచ్చాయని తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్‌లో నలుగురు ఉద్యోగులు ఉన్నారని, మంటలు గమనించిన వెంటనే వారు సురక్షితంగా బయటకు వచ్చినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో అక్కడ పని చేస్తున్న ఒక వార్డు బాయ్ మంటలను గమనించి ఆర్పేందుకు ప్రయత్నించగా స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందన్నారు.
ఈ అగ్నిప్రమాదం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందా? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టపరిణామాలపై విచారణ పూర్తయ్యాక మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.

Post a Comment