కొనసాగుతున్న మేడారం హుండీ లెక్కింపు.. రెండో రోజుకు భారీ ఆదాయం
వరంగల్; ఫిబ్రవరి 07: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండో రోజు హుండీ లెక్కింపులోనూ భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. అధికారులు చేపట్టిన లెక్కింపు ప్రక్రియలో ఇప్పటివరకు గణనీయమైన ఆదాయం సమకూరింది.
శుక్రవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో మొత్తం 160 హుండీలను లెక్కించగా ₹3,54,25,200 నగదు లభ్యమైంది. అదేవిధంగా 63,436 విలువైన విదేశీ కరెన్సీ కూడా లభ్యమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు సమ్మక్క–సారలమ్మలకు తమ మొక్కులు చెల్లిస్తూ కానుకలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు రెండు రోజుల పాటు జరిగిన హుండీ లెక్కింపులో మొత్తం 285 హుండీలను లెక్కించగా ₹6,04,53,636 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కార్యాలయం ప్రకటించింది. లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భద్రతా దళాల పర్యవేక్షణలో, రెవెన్యూ, ఆలయ సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు కొనసాగిస్తున్నారు.
మేడారం మహాజాతరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది హుండీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా మిగిలిన హుండీల లెక్కింపు పూర్తయ్యాక తుది ఆదాయ వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా మేడారం హుండీ ఆదాయం ప్రతి ఏడాదీ రికార్డు స్థాయిలో నమోదు అవుతుండగా, ఈ ఏడాది కూడా కొత్త రికార్డులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Post a Comment