నేడే మున్సిపల్ ‘పోల్’ సమరం.. బరిలో 12,930 మంది అభ్యర్థులు
హైదరాబాద్; ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందుకు గాను 11,000కు పైగా సీసీటీవీ కెమెరాలతో పోలింగ్ కేంద్రాలు, కీలక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
నేడు పోలింగ్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 16న మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో నేడు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment