శాంతియుత మున్సిపల్ ఎన్నికల కోసం సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు
రామగుండం, ఫిబ్రవరి 09: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
పెద్దపల్లి జోన్‌లోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు అలాగే మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, చెన్నూర్, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, లక్షెట్టి పేట్ మున్సిపాలిటీలలో ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీపీ వివరాల ప్రకారం, ఫిబ్రవరి 9 సాయంత్రం 5:00 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు, అలాగే ఫిబ్రవరి 13-02-2026 ఉదయం 8:00 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాల వెల్లడింపు పూర్తయ్యే వరకు సెక్షన్ 163 అమల్లో ఉంటుంది.
ఈ కాలంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం నిషేధం కాగా, ఎన్నికల వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసే ప్రవర్తన చోటుచేసుకుంటే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చట్టపరమైన అనుమతి లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని, పోలింగ్ కేంద్రాల ఒక కిలోమీటర్ పరిధిలో కర్రలు, కత్తులు, తుపాకులు లేదా ఇతర మారణాయుధాలతో సంచరించడం పూర్తిగా నిషేధమని సీపీ తెలిపారు.
అలాగే షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, మైకులు, లౌడ్‌స్పీకర్ల ద్వారా పాటలు ప్రసారం చేయడం, సభలు నిర్వహించడం, ప్రజలను ఒక వర్గంపై మరో వర్గంపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం నిషేధమని స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అటవీ అధికారులు, కేంద్ర బలగాలు, హోమ్‌గార్డులు, ఎస్‌పీఓలకు ఈ నిషేధాలు వర్తించవని తెలిపారు. ఎన్నికల సమయంలో చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించే ప్రకటనలు, ప్లకార్డులు, గుర్తులు ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమేనని సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.

Post a Comment