-->

మున్సిపల్ ప్రచారంలో విషాదం.. చేతిలోనే పేలిన బాంబు షాట్,

సుల్తానాబాద్ మున్సిపల్ ప్రచారంలో విషాదం.. చేతిలోనే పేలిన బాంబు షాట్, కార్యకర్తకు తీవ్ర గాయాలు


కరీంనగర్; ఫిబ్రవరి 09: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచార ఉత్సాహంలో భాగంగా పేల్చిన బాంబు షాట్ ప్రమాదవశాత్తు కార్యకర్త చేతిలోనే పేలడంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సాధారణంగా బాంబు షాట్లను నేలపై ఉంచి వెలిగించాల్సి ఉండగా, అతి ఉత్సాహంతో ఓ యువ కార్యకర్త వాటిని తన చేతిలోనే పట్టుకుని వెలిగించినట్లు సమాచారం. అయితే బాంబు షాట్ గాలిలోకి దూసుకెళ్లకుండా ఒక్కసారిగా అతని చేతిలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో కార్యకర్త చేతికి తీవ్ర గాయాలు కాగా, రక్తస్రావం అధికంగా జరిగినట్లు స్థానికులు తెలిపారు.

పేలుడు శబ్దంతో అక్కడున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన కార్యకర్తను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు పరిస్థితిని గమనిస్తున్నారని సమాచారం.

ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ప్రమాదకరమైన బాంబు షాట్ల వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అతి ఉత్సాహం ప్రాణాలకే ప్రమాదంగా మారుతుందని ఈ సంఘటన మరోసారి హెచ్చరిస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793