-->

స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి, పన్నెండు మందికి తీవ్ర గాయాలు

స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి, పన్నెండు మందికి తీవ్ర గాయాలు


వరంగల్; ఫిబ్రవరి 09: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ క్రాస్ రోడ్డుకు సమీపంలో మద్యం మత్తులో అతివేగంగా నడిపిన ట్రాక్టర్, ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.

తీగరాజుపల్లికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్‌కు సంబంధించిన బస్సు, అన్నారం షరీఫ్ దర్గాలో కందూరు కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ట్రాక్టర్‌లో మాత్రం డ్రైవర్‌తో పాటు 12 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రాక్టర్ స్కూల్ బస్సును ఢీకొన్న అనంతరం అదుపు తప్పి డబ్బా పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్‌లో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు కాగా, స్కూల్ బస్సులో ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు వైద్యులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ మద్యంమత్తులో అతివేగంగా వాహనం నడపడం ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793