హుస్సేన్ సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
హైదరాబాద్, ఫిబ్రవరి 10: తన ఆత్మహత్యకు భార్య, అత్తా, మామలతో పాటు మరో వ్యక్తి కారణమంటూ ఫోన్‌లో స్టేటస్ పెట్టుకుని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీతారాం రెడ్డి (36), ఆయన భార్య రేణుక ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్నారు. దంపతులు హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
కొంతకాలం క్రితం రేణుకకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కొన్ని రోజుల తరువాత తిరిగి ఇంటికి వచ్చిన ఆమె అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి 24న రేణుక మళ్లీ అదృశ్యమైంది. భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు.
ఈ క్రమంలో ఆదివారం రోజున అత్తా–మామలు పిల్లలను తీసుకుని తమ స్వగ్రామం నంద్యాలకు వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం రెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని సరస్సులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, సాయంత్రానికి మృతదేహం హుస్సేన్ సాగర్ నుంచి బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్టరీకి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడు పెట్టిన స్టేటస్ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment