-->

10వ తరగతి విద్యార్థినిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్న ఫిజిక్స్ ఉపాధ్యాయుడు

10వ తరగతి విద్యార్థినిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్న ఫిజిక్స్ ఉపాధ్యాయుడు


హైదరాబాద్; ఫిబ్రవరి 10: హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పోచారం డివిజన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన సమాజాన్ని కలచివేస్తోంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని మాయమాటలతో ప్రేమలోకి దింపి, రహస్యంగా పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పోచారం డివిజన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పర్రే మైటీన్ (27) అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఉపాధ్యాయ–విద్యార్థిని మధ్య ఉండాల్సిన గౌరవ సంబంధాలను విస్మరించి, ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు విచారణలో తేలింది. అయితే సుమారు 20 రోజుల క్రితం విద్యార్థిని మెడలో పసుపు తాడు ఉండటాన్ని గమనించిన ఆమె తల్లి అనుమానంతో ప్రశ్నించగా, జరిగిన విషయాన్ని బాలిక బయటపెట్టింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు పాఠశాల నిర్వాహకులను నిలదీశారు. అయితే వారి నుంచి నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత సమాధానం రావడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఉపాధ్యాయుడు పర్రే మైటీన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను రక్షించి, అవసరమైన కౌన్సెలింగ్‌తో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన పాఠశాలల భద్రత, ఉపాధ్యాయుల బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. మైనర్ విద్యార్థుల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793