చెట్టుకు ఉరేసుకున్న ప్రేమజంట… కుటుంబాల అంగీకారం లభించలేదనే భావనతో అఘాయిత్యం
సిద్దిపేట; ఫిబ్రవరి 10: సిద్దిపేట జిల్లా కేంద్రం పెద్దలింగారెడ్డిపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించరనే భావనతో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నకోడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (17), నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన శ్రావణ్ (24) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రావణ్ శనివారం యువతితో కలిసి బయటకు వెళ్లాడు. అయితే సాయంత్రం అయినా ఇద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ఫోన్లకు స్పందన లేకపోవడం, స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాఘవాపురం–పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివారులో ఓ చెట్టుకు జంట వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి, ఆధార్ కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతి బ్యాగ్‌లో కొత్త చీర ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రేమ వివాహానికి కుటుంబాలు అంగీకరించవనే భయం, అలాగే యువతి అక్క పెళ్లి జరిగిన తరువాతే తన పెళ్లి జరుగుతుందనే భావన ఇద్దరిలో తీవ్ర ఒత్తిడికి దారి తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ హిస్టరీ ఆధారంగా విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ప్రేమించుకుంటే ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారమా?” అంటూ ప్రశ్నిస్తూ, పెద్దలను ఒప్పించి జీవితం కొనసాగించాల్సిందిగా యువతకు సలహాలు ఇస్తున్నారు.

Post a Comment