మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం.. అనంతరం హత్య
నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఒక మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు తన వృద్ధురాలు అయిన అత్తపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన రఘుపతిపేట గ్రామంలో సంభవించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. పసుపుల చెన్నమ్మ (65) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉండగా, ఒక కుమారుడు మరణించగా, మరో కుమారుడు వేరుగా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామంలో నివసిస్తున్న కుమార్తె రేణుక, అల్లుడు బైరంపల్లి రాఘవేందర్ ఇంట్లో చెన్నమ్మ ఉండేది.
రాఘవేందర్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన గొడవ అనంతరం రేణుక, వెల్దండ మండలంలోని తన అక్క ఇంటికి వెళ్లింది.
ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించిన రాఘవేందర్, ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త చెన్నమ్మపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment