-->

5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బందిని అరెస్ట్ చేసిన ఏసీబీ

5 వేలు లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బందిని అరెస్ట్ చేసిన ఏసీబీ


జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా రూ.5 వేల లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

అధికారుల వివరాల ప్రకారం, కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి సంబంధించి లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడ్డ వారిలో పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీత ఉన్నారు. సర్టిఫైడ్ కాపీ జారీ చేయడానికి రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

పట్టుబడ్డ సిబ్బందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోర్టు పరిధిలో అవినీతి చర్యలు చోటుచేసుకోవడం పట్ల న్యాయవాదులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా కోర్టులో కలకలం రేగింది. అవినీతి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793