భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు గ్రామంలో విశేష ఘటన
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండల పరిధిలోని బోడు గ్రామంలో ఆదివారం ఒక ప్రత్యేక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి ఏదో అపశకునం సంభవించే అవకాశం ఉందనే అనుమానంతో గ్రామస్తులు ఒకరోజు పాటు ఊరిని ఖాళీ చేసి బయట గడిపారు.
గ్రామ పెద్దలు, పూజారులను సంప్రదించగా, వారు ఒకరోజు వేకువజామున గ్రామంలోని ప్రతి కుటుంబం పిల్లాపాపలతో సహా ఊరిని విడిచి వెళ్లి, సాయంత్రం వరకు బయటే ఉండాలని సూచించినట్లు సమాచారం. ఆ సూచనలను గ్రామస్తులు ఉమ్మడిగా అంగీకరించి అమలు చేశారు.
ఆదివారం ఉదయం నుంచే గ్రామంలోని ఇళ్లకు తాళాలు వేసి, చిన్నపిల్లలు, మహిళలు, యువకులు, వృద్ధులు సహా అందరూ కలిసి గ్రామ శివారులో ఉన్న మామిడి తోటకు వెళ్లి రోజు గడిపారు. దీంతో గ్రామం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది.
ప్రపంచం వేగంగా ఆధునికత వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆచారాలు కొనసాగుతుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే గ్రామస్తులు మాత్రం తమ నమ్మకాల ప్రకారం జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Post a Comment