నిజామాబాద్లో కాంగ్రెస్ విజయం చారిత్రాత్మకం: మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్‌లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ ఓటర్లకు, ముఖ్యంగా పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో జిల్లాలో మెజార్టీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని పేర్కొన్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత నిజామాబాద్ మేయర్ సీటును గెలుచుకోవడం చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు.
పండ్లు అమ్ముకునే స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగిన ఉమారాణికి అభినందనలు తెలిపారు. సాధారణ కార్యకర్త మేయర్ కావడం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.
రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో పాటు రూ.680 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కుల, మత రాజకీయాలకు ప్రజలు తావివ్వకుండా అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు.
సెంటిమెంట్ రాజేసి ప్రజలను ఉసిగొల్పడం వల్ల సుమారు 7 సీట్లు స్వల్ప మెజార్టీతో కోల్పోయామని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)పై పోటీ చేసి 5 సీట్లు గెలుచుకున్నామని చెప్పారు.
జిల్లా అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారని వెల్లడించారు.
జిల్లాను మేటి నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Post a Comment