రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవర్ మృతి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ కారు పల్టీలు కొట్టి సమీపంలోని రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘనపూర్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారు అద్దాలు పగలడంతో కారులో ఉన్న ధరావత్ చరణ్ (18) తీవ్రంగా గాయపడ్డాడు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లగా, వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కారు డ్రైవర్ భూక్య పవన్ ప్రమాదం అనంతరం కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం రిజర్వాయర్‌లో పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు.
ఈ ఘటనతో పవన్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. దేశతండా పరిసర ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment