స్వల్ప భూకంపం.. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భూ ప్రకంపనలు
తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించి ప్రజల్లో ఆందోళన కలిగించింది. మంచిర్యాల జిల్లా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది.
భూకంప కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు సమాచారం. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు అనుభవించారని స్థానికులు చెబుతున్నారు.
బెజ్జూర్ మండలంలో 3 సెకన్ల పాటు కంపనం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కదిలి కిందపడిపోయాయి. గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మేల్కొని భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
సీసీటీవీ కెమెరాల్లో వస్తువులు కదిలిన దృశ్యాలు రికార్డవగా, ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలోనూ భూకంపం
కొన్ని నెలల క్రితం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. అప్పట్లో కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఆ సమయంలో భూకంప కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన సమీపంలో గుర్తించారు.
ప్రస్తుతం ఈ తాజా భూకంపంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం సంభవించలేదని ప్రాథమిక సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment