అహోబిలంలో కన్నుల పండుగలా బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ సమీపంలోని పవిత్రక్షేత్రం అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల సందోహంతో వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎగువ అహోబిలంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
అలాగే భద్రాచలం అహోబిలమఠం ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణచైతన్య స్వామి ఆధ్వర్యంలో, అహోబిల మఠం 46వ మఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహా దేశికన్ స్వామివారిని నాగా సీతారాములు దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, సేవలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తుండటంతో అహోబిలం ప్రాంతం ఆధ్యాత్మిక కాంతులతో వెలుగొందుతోంది.

Post a Comment