-->

హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు

డెకాయ్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ నిందితుడు – మూడేళ్లుగా అక్రమ క్లినిక్ నిర్వహణ


హైదరాబాద్, ఫిబ్రవరి 07: హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్టర్ల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. మల్లాపూర్ భవానీనగర్ ప్రాంతంలో అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న ఓ నకిలీ డాక్టర్‌ను నాచారం పోలీసులు మల్కాజ్‌గిరి జోన్ ఎస్ఓటీ సహకారంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేశారు.

మల్లాపూర్ భవానీనగర్‌లోని “అక్షయ ఫస్ట్ ఎయిడ్ సెంటర్” అనే ప్రైవేట్ క్లినిక్‌లో సరైన వైద్య అర్హతలు లేకుండానే ఓ వ్యక్తి డాక్టర్‌గా నటిస్తూ చికిత్స అందిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన నాచారం సబ్‌ ఇన్‌స్పెక్టర్ పి. ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో స్పెషల్ ఆపరేషన్ టీం ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సైలు మల్లేష్, వాసుదేవ్, సిబ్బంది కలిసి డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు.

ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ రాహుల్ ఆదిత్య (10719) మఫ్టీలో రోగిగా క్లినిక్‌కు వెళ్లి కడుపు నొప్పి ఉందని చెప్పగా, అక్కడ ఉన్న వ్యక్తి డాక్టర్‌లా నటిస్తూ పరీక్షించి మందులు సూచించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు క్లినిక్‌పై దాడి చేసి విచారణ చేపట్టగా, అతను తన పేరు సురే వెంకట కృష్ణ (సురేష్) అని వెల్లడించాడు.

విచారణలో గత మూడేళ్లుగా ఎటువంటి వైద్య అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్ఐఎం కాలేజీలో ఇంటర్మీడియట్ బీఎస్సీ నర్సింగ్ చదువును ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే వదిలివేసినట్లు, అనంతరం మాచర్లలో ఓ రిటైర్డ్ డాక్టర్ వద్ద కంపౌండర్‌గా పని చేస్తూ వైద్య పరిజ్ఞానం సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది. 

ఆ అనుభవంతోనే 2022లో హైదరాబాద్‌కు వచ్చి అక్రమంగా క్లినిక్ ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793