రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న రైతు భరోసా పథకంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా, వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని వచ్చే యాసంగి సీజన్ నుంచే అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది.
ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉండటంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నిధులు ఎప్పుడు జమ అవుతాయన్న విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతుల్లో ఆసక్తితో పాటు ఆందోళనను కూడా కలిగిస్తోంది.
శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా అర్హుల గుర్తింపు
కేవలం కాగితాల లెక్కలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూములను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ సర్వే ఇప్పటికే పూర్తైంది.
ఈ సర్వేలో రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టా భూముల్లో 8 నుంచి 12 శాతం వరకు సాగులో తేడా (సుమారు 20 లక్షల ఎకరాలు) ఉన్నట్లు గుర్తించారు. ఈ డేటాను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
నీటి కొరత ఉన్న జిల్లాల్లో ఖాళీ భూములు ఎక్కువ
పంట బీమా, కొనుగోళ్లలో పారదర్శకతకు ఉపయోగం
శాటిలైట్ మ్యాపింగ్ విధానం ద్వారా రైతులకు పంట బీమా నష్టపరిహారం సకాలంలో అందడం, అలాగే వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, అమ్మకాలలో పారదర్శకత పెరగనుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈనెల 14 తర్వాత తుది నిర్ణయం
సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు. సాగు భూముల గుర్తింపులో భాగంగా గ్రామాల వారీగా ఏఈవోలు క్షేత్రస్థాయిలో సర్వే చేసి లోటుపాట్లు సరిదిద్దనున్నారు.
అగ్రికల్చర్ యూనివర్శిటీ రూపొందించిన పంట వివరాలను ఈనెల 14 తర్వాత ప్రభుత్వానికి అందించనుండగా, ఆ డేటాపై టెక్నికల్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Post a Comment