నకిలీ మానవ హక్కుల సంఘాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉక్కుపాదం
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) పేరును పోలి ఉన్న నకిలీ సంస్థలపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. తమ పేరుతో లేదా దానికి సమానమైన పేర్లతో రిజిస్టర్ అయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సంస్థలు, వ్యక్తులపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
నకిలీ సంస్థపై సుమోటో విచారణ
ఇటీవల కమిషన్ దృష్టికి వచ్చిన ఒక ఘటనలో, 2022లో ఢిల్లీలో “నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)” పేరుతో ఓ ఎన్‌జీవో రిజిస్టర్ అయినట్లు ఫిర్యాదులు అందినట్టు వెల్లడించింది. ఆ సంస్థకు నీతిఆయోగ్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉందని ప్రచారం చేస్తున్నట్లు గుర్తించింది. కర్ణాటకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఆ సంస్థకు “స్టేట్ చైర్మన్”గా వ్యవహరిస్తున్నట్లు తేలినట్టు పేర్కొంది.
ఈ వ్యవహారం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కమిషన్ సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఇలాంటి మోసపూరిత పేర్లు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడమే కాకుండా, కమిషన్ అధికారిక భాగమని లేదా తమచే గుర్తింపు పొందిన సంస్థలని భ్రమ కల్పిస్తున్నాయని అభిప్రాయపడింది.
నమ్మకానికి భంగం – నిధుల దుర్వినియోగం ప్రమాదం
ఇలాంటి చర్యలు కమిషన్ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశముందని, అలాగే నిధుల దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
రాష్ట్రాలకు కఠిన ఆదేశాలు
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరును దుర్వినియోగం చేస్తున్న సంస్థలను గుర్తించి, వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో పాటు తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ప్రత్యేకించి, ఢిల్లీలో రిజిస్టర్ అయి కర్ణాటకలో కార్యకలాపాలు సాగిస్తున్న సదరు నకిలీ సంస్థపై తీసుకున్న చర్యల వివరాలను రెండు వారాల్లోగా సమర్పించాలని ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆదేశించింది.
ప్రజల్లో గందరగోళాన్ని నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని కమిషన్ స్పష్టం చేసింది.

Post a Comment