జిల్లాల రద్దు లేదు, సింగరేణి మెడికల్ బోర్డు కొనసాగుతుంది
జయశంకర్ భూపాలపల్లి | ఫిబ్రవరి 9: కొన్ని జిల్లాలను రద్దు చేస్తారన్నది, సింగరేణి మెడికల్ బోర్డును ఎత్తివేస్తారన్నది పూర్తిగా తప్పుడు, విష ప్రచారమేనని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఏ జిల్లాను తొలగించాలన్న ఆలోచన గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చిచెప్పారు. అలాగే, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని ఖండించారు.
చెల్పూరులో ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ సభ
‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై సమగ్రంగా వివరించారు.
జిల్లాల రద్దుపై స్పష్టత
“జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాను. ఏ జిల్లాను రద్దు చేయడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా జిల్లాల రేషనలైజేషన్ అవసరమైతే, ప్రజలకు ముందుగా తెలియజేసి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాం” అని సీఎం తెలిపారు.
కుట్రలను తిప్పికొట్టే శక్తి భూపాలపల్లికి ఉంది
ఎన్ని కుట్రలు, అపోహలు సృష్టించినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతమని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించే శక్తి ప్రజలకు ఉందని సీఎం అన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.
సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం
2027 పుష్కరాలకు భారీ ప్రణాళిక
2027లో నిర్వహించబోయే పుష్కరాలపై ముఖ్యమంత్రి వివరించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను పర్యాటక పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
మేడారం, సరస్వతి పుష్కరాల ప్రస్తావన
గతేడాది సరస్వతి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించామని, అలాగే సమ్మక్క–సారలమ్మ జాతరను దక్షిణ కుంభమేళాగా గొప్పగా నిర్వహించామని సీఎం గుర్తు చేశారు. మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు.
వరంగల్ జిల్లాకు 6,116 కోట్ల అభివృద్ధి నిధులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 6,116 కోట్ల రూపాయలను కేటాయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమాల్లో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కు పంపిణీ
ఈ బహిరంగ సభ వేదిక నుంచే ‘సమ్మక్క–సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు 205 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment