-->

బాలికపై అత్యాచారం కేసు నిందితుడి మృతి.. చెరువులో మృతదేహం గుర్తింపు

బాలికపై అత్యాచారం కేసు నిందితుడి మృతి.. చెరువులో మృతదేహం గుర్తింపు


అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో సంచలనం రేపిన బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కులవర్ధన్‌ (30) మృతదేహం జిల్లాలోని కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో లభ్యమైంది. స్థానికులు చెరువులో మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి మరణానికి గల కారణాలపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, నిందితుడు ఎదురింట్లో నివసించే బాలికపై అత్యాచారం చేసి, అనంతరం నీళ్ల డ్రమ్‌లో ముంచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం నిందితుడి మృతి ఆత్మహత్యా? లేక ఇతర కారణాల వల్ల జరిగిందా? అన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793