కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో మార్చి 6 నుంచి 12 వరకు నిర్వహించనున్న 99 రోజుల “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల ప్రయోజనాలను ప్రజలకు స్పష్టంగా వివరించడం కలెక్టర్ల బాధ్యత అని పేర్కొన్నారు.
గ్రామ సభల వేదికగా పథకాల అమలు వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్తే పారదర్శకత పెరుగుతుందని సూచించారు. విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మధ్యాహ్న భోజన పథకాల బిల్లులను సమయానికి చెల్లించడం, ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయడం వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.
కొంతమంది కలెక్టర్ల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో నివాసం లేకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం సహించబోమని హెచ్చరించారు. పనితీరు మార్చని పక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే 99 రోజుల ప్రణాళికలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, కలెక్టర్లు తమ పరిధిని దాటి వ్యవహరించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులో లక్ష్యాలు సాధించాలని అధికారులను ప్రోత్సహించారు. హైఓల్టేజ్ సమీక్షకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందనే సంకేతాలు సమావేశంలో కనిపించాయి.

Post a Comment