-->

నేటి నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

నేటి నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 01: తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి అందజేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.

ఈ మేరకు అవసరమైన బియ్యం నిల్వలను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలకు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులు తమ సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి మూడు నెలల బియ్యాన్ని పొందవచ్చని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, 3.39 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి నెలకు సుమారు 2 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతుండగా, మూడు నెలల కోసం దాదాపు 6 లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధం చేసినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గోదాముల్లో బియ్యం నిల్వలు అధికంగా ఉండటం, రాబోయే పంట సీజన్‌కు స్థలం కల్పించాల్సిన అవసరం నేపథ్యంలో గోదాములను ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఒకేసారి మూడు నెలల పంపిణీ చేపట్టినట్టు తెలుస్తోంది.

లబ్ధిదారులు నిర్ణీత తేదీల్లో తమ రేషన్‌ను తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793