వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య
హనుమకొండ జిల్లా పరకాల పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మడికొండకు చెందిన సుమన్ (35) ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుమన్ భార్య లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
భర్త తన సంబంధానికి అడ్డంకిగా మారాడని భావించిన లావణ్య, తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ప్రియుడు సహా మరో 8 మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను రంగంలోకి దింపింది.
ఈ నెల 4న సుమన్‌ను ములుగు జిల్లా దయ్యాలవాగు సమీపానికి తీసుకెళ్లి, అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Post a Comment