గ్యాస్ సిలెండర్ పేలి నలుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
సత్యసాయి జిల్లా కదిరి పట్టణ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించి విషాదం నెలకొంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కనీసం 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సమీపంలోని ఐదు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో రక్షణ చర్యలు అత్యవసరంగా కొనసాగుతున్నాయి.
మృతులను మబున్నీ, మధు, సంపత్, వెంకన్నగా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి గ్యాస్ సిలిండర్ పేలుడా లేదా జెలెటిన్ స్టిక్స్ కారణమా అనే విషయంపై స్పష్టత రాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Post a Comment