కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?.. మంత్రి తుమ్మల ఫైర్
ఖమ్మం, ఏప్రిల్ 20: కబ్జా చేసిన స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేసి తమకు నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిన్న జరిగిన జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి, హరీష్ రావు మాట్లాడే తీరును చూస్తే ఆయన మానసిక స్థితి సరిగా లేదనిపిస్తోందని విమర్శించారు. పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన వారు ఇప్పుడు నీతులు చెప్పడం విచిత్రమని అన్నారు.
రైతు బంధు, సీఎం రిలీఫ్ ఫండ్‌లలో అవకతవకలు జరగలేదా అంటూ ప్రశ్నించిన ఆయన, భూ కబ్జాలు, ప్రజలపై కేసులు పెట్టించడం వంటి చర్యలు ఎవరి పాలనలో జరిగాయో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రుణమాఫీని మూడు నెలల్లోనే అమలు చేసి రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం అని తెలిపారు. ఇప్పటివరకు రూ.25 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, అనుమానం ఉంటే ఖాతా వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పార్టీ లోపల హరీష్ రావు స్థాయి ఏమిటో ముందుగా తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment