-->

సామాజిక సమానత్వానికి బసవేశ్వరుడి బోధనలు మార్గదర్శకం – జిల్లా కలెక్టర్ అంకిత్

సామాజిక సమానత్వానికి బసవేశ్వరుడి బోధనలు మార్గదర్శకం – జిల్లా కలెక్టర్ అంకిత్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం బసవేశ్వరుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, బసవేశ్వరుడి జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సమాజంలో వర్ణ వివక్ష నిర్మూలనకు, దళిత మరియు బహుజన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి విశిష్టమని తెలిపారు. సమానత్వం, న్యాయం, శ్రమకు గౌరవం వంటి విలువలను బసవేశ్వరుడు బోధించినట్లు చెప్పారు.

చిన్న వయస్సులోనే శైవ సాంప్రదాయాలపై అవగాహన సాధించిన బసవేశ్వరుడు, కర్మకాండాలపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఉపనయనం చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి కూడల సంగమానికి చేరి సంగమేశ్వరుని భక్తితో ఆరాధించినట్లు పేర్కొన్నారు. ఆయన స్థాపించిన “అనుభవ మండపం” అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచుకునే వేదికగా నిలిచిందన్నారు.

“మనుషులందరూ ఒక్కటే”, “దేహమే దేవాలయం”, “స్త్రీ-పురుష భేదం లేదు”, “శ్రమకు మించిన సౌందర్యం లేదు” అనే బసవేశ్వరుడి సందేశాలు నేటి సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. యువత ఈ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మీ, ఎ.డి. మైన్స్ జి. దినేష్, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. ఉపేందర్, యువజన శాఖ పరందామ రెడ్డి, గుమలాపురం సత్యనారాయణ, ముదురుకోళ్ళ కిషోర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793