మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు: జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్: ఏప్రిల్ 18: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే ముందస్తు అవగాహన ఉన్నప్పటికీ, బీజేపీ కుట్రపూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చిందని ఆమె ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై శుక్రవారం విడుదల చేసిన వీడియో సందేశంలో కవిత స్పందించారు. మహిళా కోటా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును ముడిపెట్టడం వల్ల ప్రతిపక్షాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి బిల్లు ఆమోదం పొందకుండా చేశాయని పేర్కొన్నారు. రాజకీయ లాభం కోసం బీజేపీ ఈ విధానం అనుసరించిందని ఆమె విమర్శించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, దానిని జనగణన (సెన్సస్)తో అనుసంధానించారని కవిత తెలిపారు. ఇప్పుడు 2011 జనగణన ఆధారంగా బిల్లు తీసుకువస్తామని చెప్పడం ద్వారా మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మహిళలు బీజేపీ వైఖరిని గమనించాలని కవిత పిలుపునిచ్చారు.

Post a Comment