రోకలిబండతో భార్య, కుమారుడిని హతమార్చిన భర్త – కూతురు ప్రాణాపాయంలో
రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, చిన్న కుమారుడిపై రోకలిబండతో దాడి చేసి హతమార్చగా, కుమార్తె తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం పులిగోనిపల్లితండాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాణావత్ రాందాస్ నాయక్, కవిత (28) 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
గతంలో కాటన్ మిల్లులో పనిచేసిన రాందాస్ నాయక్, తర్వాత మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతలను విస్మరించగా, భార్య కవిత కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవపడిన రాందాస్, తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో భార్య కవిత, కుమార్తె ప్రణీత (9), కుమారుడు హర్షవర్ధన్ (7)పై రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో కవిత, హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ప్రణీతను వెంటనే Osmania General Hospital కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటన అనంతరం పోలీసులు నిందితుడు రాందాస్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతనిపై గతంలో కుటుంబ వేధింపుల కేసు నమోదై ఉండటం గమనార్హం.
ఇక ఈ ఘటనలో తండ్రిని కఠినంగా శిక్షించాలని రెండో కుమార్తె పావని కన్నీటి పర్యంతమవుతూ చేసిన రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి.

Post a Comment