తెలంగాణ పంచాయతీలకు జాతీయ కిరీటం రెండు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు
హైదరాబాద్, ఏప్రిల్ 01: తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణాభివృద్ధి రంగంలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’లో రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నాయి.
వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలానికి చెందిన మోతుకుపల్లి గ్రామ పంచాయతీ “గుడ్ గవర్నెన్స్” విభాగంలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకోగా, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ “విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ” విభాగంలో అత్యుత్తమ అవార్డును సాధించింది.
గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, మహిళా సాధికారత, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలులో చూపిన విశిష్ట ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న గ్రామీణాభివృద్ధి చర్యలకు ఇవి నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డు అందుకున్న పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సిబ్బంది, ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఇలాంటి విజయాలు రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ప్రేరణగా నిలిచి, భవిష్యత్తులో మరిన్ని పంచాయతీలు జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment