-->

ప్రముఖ నటి సుభాషిణి ఆత్మహత్య? సినీ వర్గాల్లో కలకలం

 

ప్రముఖ నటి సుభాషిణి ఆత్మహత్య? సినీ వర్గాల్లో కలకలం

హైదరాబాద్: ఏప్రిల్ 06: తమిళ బుల్లితెరపై తనదైన నటనతో గుర్తింపు పొందిన నటి సుభాషిణి (36) ఆత్మహత్య చేసుకున్న ఘటన సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. చెన్నైలోని పోరూరులో ఉన్న ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం.

శ్రీలంకకు చెందిన సుభాషిణి, బెంగళూరుకు చెందిన పిప్పిన్‌ను వివాహం చేసుకున్నారు. షూటింగ్‌ల కారణంగా ఆమె చెన్నైలో ఒంటరిగా నివసిస్తుండగా, భర్త బెంగళూరులో ఉంటున్నారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆదివారం రాత్రి ఆమె తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవతో మనస్తాపానికి గురైన ఆమె, కాల్ ముగిసిన వెంటనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

కుటుంబ కలహాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని ఆమె సన్నిహితులు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండే సుభాషిణి, తమిళంలో ప్రసిద్ధి చెందిన ‘కయల్’ సీరియల్ ద్వారా మంచి పేరు సంపాదించారు. పలు చిత్రాల్లో కథానాయికగా నటించి అభిమానులను సంపాదించారు.

సమాచారం అందుకున్న పోరూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె మొబైల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

వీడియో కాల్‌లో అసలు ఏమి జరిగింది? గొడవకు కారణం ఏమిటి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా భర్త పిప్పిన్‌ను కూడా పోలీసులు విచారించే అవకాశముంది.

మంచి భవిష్యత్తు ఉన్న నటి చిన్న వయసులోనే అర్థాంతరంగా మృతి చెందడం పట్ల తమిళ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793