ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. తీవ్ర గాయాలు
కోదాడ, ఏప్రిల్ 5: సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల భవనం పై అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది.
పోలీసులు, సహ విద్యార్థుల వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన బూరుగు మైనా (22) ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ అకస్మాత్తుగా కళాశాల భవనం పై అంతస్తు నుంచి దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమె తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఘటనను గమనించిన విద్యార్థులు, కళాశాల సిబ్బంది వెంటనే స్పందించి మైనాను కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే గాయాలు తీవ్రమై ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భవనం పై అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి పడిందా లేదా ఆత్మహత్యాయత్నమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

Post a Comment