-->

ఏసీబీ వలలో నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడీఈ.. రూ.25 వేల లంచం తీసుకుంటూ పట్టివేత

ఏసీబీ వలలో నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడీఈ.. రూ.25 వేల లంచం తీసుకుంటూ పట్టివేత


మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్‌లో పనిచేస్తున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్స్ (ADE, OP) ముద్దం రమణారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కాడు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:40 గంటల సమయంలో తన కార్యాలయంలోనే రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడు చేసిన 11 పనుల బిల్లులు మొత్తం రూ.3,13,882 విలువ కలిగి ఉండగా, వాటిని మెదక్ డివిజనల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేయడానికి అధికారిక సహాయం చేస్తానంటూ ఏడీఈ ముద్దం రమణారెడ్డి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.

ఫిర్యాదు మేరకు ఉచ్చుపన్ని, అధికారులు కార్యాలయంలోనే లంచం స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.25 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సేవకుడిగా తన విధులను అక్రమంగా, అవినీతిపరంగా నిర్వహించి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని SPE & ACB కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ద్వితీయ అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

లంచం డిమాండ్ చేసే ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేయాలనుకునే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే వాట్సాప్‌ (9440446106), ఫేస్‌బుక్‌లో “Telangana ACB”, ఎక్స్‌ (ట్విటర్)లో @TelanganaACB ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793