భారీ చిట్‌ఫండ్ మోసం – రూ.2 కోట్లు కాజేసి దంపతుల పరారీ
హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చిట్‌ఫండ్ మోసం వెలుగుచూసింది. భార్యాభర్తలు కలిసి చిటీల పేరుతో ప్రజలను నమ్మబలికి దాదాపు రూ.2 కోట్లు కాజేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల ప్రకారం… వైష్ణవి కాలనీకి చెందిన సురేష్, అతని భార్య గత పదేళ్లుగా చిటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాలనీ వాసులు, పరిసర ప్రాంతాల ప్రజలను ఆకర్షిస్తూ చిటీలలో పెట్టుబడులు పెట్టించారు. ఒక్కో సభ్యుడి నుంచి రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
డబ్బులు భారీగా కూడబెట్టుకున్న తర్వాత “రేపు ఇస్తాం, మాపు ఇస్తాం” అంటూ కాలయాపన చేసిన సురేష్ దంపతులు చివరకు బోర్డు తిప్పేశారు. గడువు ముగిసినా చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇంకా బాధితులకు చెల్లని చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 25 మందికి పైగా ఈ మోసానికి గురైనట్లు సమాచారం. తమ కష్టార్జితాన్ని నమ్మకంతో పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు రోడ్డున పడ్డామని బాధితులు వాపోతున్నారు.
బాధితులు డబ్బులు కోరగా, “ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ దంపతులు నిర్లక్ష్యంగా స్పందించారని తెలిపారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. ఈ చిట్‌ఫండ్ సంస్థ అసలు రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్ దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Post a Comment