-->

రోడ్డును కమ్మేసిన పొగ.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు మృతి

రోడ్డును కమ్మేసిన పొగ.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు మృతి

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నారాయణగిరిపల్లె గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వరి కొయ్యలకు రైతులు నిప్పంటించడంతో వ్యాపించిన దట్టమైన పొగ ఈ ప్రమాదానికి కారణమైనట్లు స్థానికులు తెలిపారు.

స్థానికుల వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నలేంద్ర లక్ష్మి(40), కుమార్తె నలేంద్ర దీపిక(19), కుమారుడు నలేంద్ర సాయికిరణ్ కలిసి శనివారం సాయంత్రం బైక్‌పై గణపురం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో నర్సాపూర్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లక్ష్మి, దీపిక, సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మి, దీపిక మృతి చెందగా, సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రోడ్డుకు ఇరువైపులా కొందరు రైతులు వరి కొయ్యలకు నిప్పంటించడంతో దట్టమైన పొగ వ్యాపించి దారి కనిపించకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగానే కారు డ్రైవర్‌కు బైక్ కనిపించక ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్‌పై ఉన్న వారు మంటలపై పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793