-->

గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు వ్యక్తి సహా పశువుల మృతి

నాగర్‌కర్నూల్ జిల్లాలో గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు వ్యక్తి సహా పశువుల మృతి


నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్ర బీభత్సం సృష్టించింది. పలుచోట్ల పిడుగుపాట్లు సంభవించడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, కాడెద్దులు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి. భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

తాడూరు మండలం గోవిందాయిపల్లి గ్రామంలో గొర్రెలు మేపుతున్న కాపరి మల్లయ్యపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

అదేవిధంగా నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 28 గొర్రెలు మృతి చెందాయి. తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు చెన్నయ్య, మల్లయ్య మేత కోసం గొర్రెలను తీసుకెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పిడుగు పడటంతో 28 గొర్రెలు చనిపోవడంతో కాపరులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.

మరోవైపు అచ్చంపేట మండలం బుడ్డతాండలో పిడుగుపడిన ఘటనలో ఓ గిరిజన రైతుకు చెందిన రెండు కోడె దూడలు మృతి చెందాయి. దీంతో రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కల్లాల్లో నిల్వ ఉంచిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలుల ప్రభావంతో రోడ్లపై పెద్ద ఎత్తున చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పశువుల కొట్టాలు, రేకుల షెడ్లు కూడా గాలిదుమారానికి దెబ్బతిన్నాయి.

జిల్లాలో చోటుచేసుకున్న ఈ గాలివాన బీభత్సానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793