-->

ఇందిరాపార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత మద్దతు

సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి ధర్నాలో కూర్చుంటానన్న టీఆర్ఎస్ చీఫ్


Kalvakuntla Kavitha హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కొనసాగుతున్న సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సాయంత్రం లోపు చర్చలకు పిలవాలని ఆమె డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే తాను కూడా కార్మికులతో కలిసి ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న భారీ భవనాలు, అద్దాల మేడల నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఎత్తైన భవనాలపై పనిచేస్తున్నా, వారి పేరు ఒప్పందాల్లో కూడా నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.2 లక్షల పనుల కోసం వెళ్లే కార్మికులు తమతో పాటు రూ.15 లక్షల విలువైన మెటీరియల్ తీసుకెళ్తున్నప్పటికీ, ఆ సామగ్రికి రక్షణ లేదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా హైడ్రా చర్యల కారణంగా నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చివేస్తుండటంతో సెంట్రింగ్ కార్మికుల మెటీరియల్ నష్టపోతున్నదని అన్నారు. ఈ నష్టాలకు ప్రభుత్వం గానీ, ఇంటి యజమానులు గానీ పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 86 ప్రాంతాల్లో సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు పదిరోజులుగా పనులు బంద్ చేసి నిరసన చేపడుతున్నారని కవిత తెలిపారు. అయినప్పటికీ తమ వద్ద పనిచేసే కూలీలను కార్మికులే ఆదుకుంటున్నారని, వారు చూపుతున్న మానవత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు.

కార్మికులు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవేనని పేర్కొన్న కవిత, ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్‌కు రూ.51 చెల్లింపు, ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం వంటి 12 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.

మేస్త్రీల చేతిలో కార్మికులు బానిసలుగా మారకూడదని, ప్రతి మండలంలో సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రింగ్ కార్మికుల అన్ని డిమాండ్లను నెరవేర్చడంతో పాటు 186 ప్రాంతాల్లో వెయ్యి నుంచి రెండు వేల గజాల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం సెంట్రింగ్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కవిత హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793