బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం
హైదరాబాద్, మే 30: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల సింగరేణి అంశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసుల ఆధారంగా ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో బాల్క సుమన్ సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని వ్యాఖ్యానించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు మిలిటెంట్ తరహాలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియల కోసం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
అయితే తన అరెస్ట్‌పై వస్తున్న వార్తలను బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని, తనను అరెస్ట్ చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు నమోదు చేస్తున్నారని కూడా ఆరోపించారు.
ఇక బాల్క సుమన్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Post a Comment