-->

హైదరాబాద్‌ను వణికిస్తున్న నేపాలీ గ్యాంగ్.. మరో దారుణ దోపిడీ కలకలం

హైదరాబాద్‌ను వణికిస్తున్న నేపాలీ గ్యాంగ్.. మరో దారుణ దోపిడీ కలకలం


హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్‌ల అరాచకాలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్‌లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు ఇంకా మిస్టరీగానే ఉండగా.. తాజాగా జవహర్‌నగర్ పరిధిలో మరో భారీ దోపిడీ సంచలనం సృష్టించింది.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్. మురళీ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులను లక్ష్యంగా చేసుకుని నేపాలీ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు 20 రోజుల క్రితం ఓ నేపాలీ జంట ఆ ఇంట్లో పనిమనుషులుగా చేరింది. కొద్ది రోజుల తర్వాత తమ బంధువని చెబుతూ మరో మహిళను కూడా ఇంటికి పరిచయం చేశారు. కుటుంబ సభ్యుల విశ్వాసం సంపాదించిన తర్వాత ముందుగానే ప్లాన్ వేసి దోపిడీకి రంగం సిద్ధం చేసినట్లు అనుమానిస్తున్నారు.

సోమవారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని యజమానులను కోరగా.. వారు అనుమతి ఇచ్చారు. అదే అవకాశంగా తీసుకున్న గ్యాంగ్ మరో ముగ్గురు వ్యక్తులను ఇంట్లోకి రప్పించింది. దంపతులు భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వారిపై దాడి చేసి చేతులు, కాళ్లు కట్టేసి బంధించారు. బాధితులు ప్రాణాలు కాపాడాలని వేడుకోవడంతో మత్తుమందు ఇచ్చి ఓ గదిలో నిర్బంధించారు.

అనంతరం ఇంట్లోని సుమారు 60 నుంచి 80 తులాల బంగారం, భారీగా వెండి వస్తువులు, రూ.30 వేల నగదు, విదేశీ కరెన్సీ, మొబైల్ ఫోన్లు దోచుకుని పరారయ్యారు. వెళ్లే ముందు ఇంట్లోని సీసీ కెమెరాలు, డీవీఆర్ వ్యవస్థలను ధ్వంసం చేసి ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.

మరుసటి రోజు మత్తు తగ్గిన తర్వాత బాధితులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు.

ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఇంట్లో పనిమనుషులను నియమించే ముందు పోలీస్ వెరిఫికేషన్, ఆధార్ వివరాలు, స్థానిక చిరునామా, రిఫరెన్స్ తప్పనిసరిగా పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793