శ్రీచైతన్య హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Sri Chaitanya Educational Institutionsకు చెందిన హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నం జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది.
విశాఖపట్నం భీమిలి పరిధిలోని కాపులుప్పాడ ప్రాంతంలో ఉన్న శ్రీచైతన్య హాస్టల్‌లో నివాసం ఉంటున్న నడుమురి జ్యోత్స్న (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా వుడా కాలనీకి చెందిన జ్యోత్స్న, స్థానిక శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది.
ఆదివారం ఉదయం విద్యార్థిని గదిలో అపస్మారక స్థితిలో కనిపించడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.

Post a Comment