పంట పొలంలో అకస్మాత్తుగా మంటలు రైతు సజీవ దహనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంట పొలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రైతు సజీవ దహనమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గడ్డి కట్టలకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నంలో రైతు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం (మే 23) సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి సమీపంలో ఉన్న గడ్డి కట్టలకు అంటుకున్నాయి. ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు రైతు చంద్రమౌళి (62) ప్రయత్నించగా, ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్నాడు.
మంటలు తీవ్రరూపం దాల్చడంతో చంద్రమౌళికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలోనే ఆయన మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘటనపై ఆరా తీసి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment