కోటి రూపాయల కిరీటం మాయం.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ..!
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా గుడివాడలోని ఈ ప్రసిద్ధ ఆలయంలో జరిగిన ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ ఉన్నతస్థాయి విచారణ ప్రారంభించింది.
ఆలయానికి చెందిన బంగారు కిరీటాన్ని అక్రమంగా తాకట్టు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి రావడంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ అర్చకులు, సిబ్బందిని ప్రశ్నించి కీలక వివరాలు సేకరించారు.
దేవస్థానం ట్రస్ట్ కార్యాలయం తాళాలు తెరిపించి రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు లెక్కలు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. అయితే ముందస్తు సమాచారం ఇచ్చినా ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యుల్లో ఒక్కరూ హాజరు కాకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫోన్లలో సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై అసిస్టెంట్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
దర్యాప్తులో భాగంగా కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన దాత కుటుంబ సభ్యులను కూడా అధికారులు కలిసి పూర్తి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఆలయ కమిటీ నేరుగా దేవాదాయ శాఖ పరిధిలో లేకపోవడంతో వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.
రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగారు వ్యాపారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తన ఖాతాలో జమ చేసిన డబ్బులు తిరిగి చెల్లిస్తేనే ఊరికి వస్తానని ట్రస్ట్ బోర్డుకు సమాచారం పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఆభరణాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Post a Comment