-->

ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా అరాచకం.. కమీషన్ల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం

 

మంచిర్యాలలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా అరాచకం.. కమీషన్ల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం

మంచిర్యాలలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా అరాచకం.. కమీషన్ల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం!

రోగుల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యం.. మంచిర్యాలలో అంబులెన్స్ దందా బహిర్గతం

మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు, డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రోగుల అత్యవసర పరిస్థితులను అవకాశంగా మార్చుకొని భారీగా డబ్బులు వసూలు చేయడం, తమ అంబులెన్స్‌లలో కాకుండా ఇతర వాహనాల్లో రోగులను తరలిస్తే అడ్డుకోవడం, అవసరమైతే దాడులకు కూడా దిగడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సమయానికి ఆస్పత్రులకు తరలించాల్సిన బాధ్యత ఉన్న అంబులెన్స్ సిబ్బంది, కమీషన్ల కోసం ఆస్పత్రుల మధ్య తిప్పుతూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కిరాయి ఎక్కువ చెప్పడంతో మొదలైన వివాదం

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఎం. రఘు తన బంధువైన సాలక్కను చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తరలించాల్సి రావడంతో ఐబీ చౌరస్తా సమీపంలోని ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను సంప్రదించగా, అధిక కిరాయి చెప్పినట్లు సమాచారం.

దీంతో వారు మరో ప్రైవేట్ వాహనంలో రోగిని తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని అడ్డగించి వాగ్వాదానికి దిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎలాగోలా కరీంనగర్‌కు తరలించినప్పటికీ, ఆలస్యం కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలిపారు.

ఇదే విషయంపై ఆగ్రహంతో అంబులెన్స్ డ్రైవర్, యజమాని కలిసి ఎండీ సల్మాన్‌పై ఈ నెల 21న రాత్రి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాయపడిన సల్మాన్ శుక్రవారం మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు దోపిడీ!

జిల్లా కేంద్రంలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు రోగుల కుటుంబ సభ్యుల నుంచి అడ్డగోలుగా కిరాయిలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు రోగులను తరలించేందుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

అంత మొత్తం చెల్లించలేమని చెబితే దురుసుగా ప్రవర్తించడం, బెదిరింపులకు దిగడం, కొన్నిసార్లు భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కమీషన్ల కోసం ఆస్పత్రుల మార్పిడి

ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై కమీషన్ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్యులు సూచించిన ఆస్పత్రులకు కాకుండా తమకు కమీషన్ వచ్చే ఆస్పత్రులకు రోగులను తరలిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో సుమారు 350 ప్రైవేట్ అంబులెన్స్‌లు ఉండగా, ఒక్క మంచిర్యాల పట్టణంలోనే వందకు పైగా ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలామంది ఆస్పత్రులతో సంబంధాలు పెంచుకొని ఒక్కో రోగిపై రూ.30 వేల వరకు కమీషన్ పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కమీషన్ దందాతో యువకుడి మృతి.. గత ఘటన మళ్లీ చర్చలోకి

రెండేళ్ల క్రితం జైపూర్ మండలం షెట్‌పల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేసినప్పటికీ, కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు కమీషన్ల కోసం ఆస్పత్రుల మధ్య తిప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

సకాలంలో సరైన చికిత్స అందక యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో అనంతరం మృతి చెందాడు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కొంతమంది డ్రైవర్లపై కేసులు నమోదై జైలుకు కూడా వెళ్లినట్లు సమాచారం.

అధికారుల చర్యలు ఎప్పుడంటూ ప్రశ్నలు

ప్రాణరక్షక సేవలుగా ఉండాల్సిన అంబులెన్స్ వ్యవస్థ, కొంతమంది నిర్వాహకుల కారణంగా భయానక దందాగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ అంబులెన్స్‌ల కిరాయిలపై నియంత్రణ, కమీషన్ వ్యవస్థపై విచారణ, రోగుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793