భార్య మృతిని తట్టుకోలేక.. కొడుకుతో కలిసి అర్చకుడి ఆత్మహత్య
జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ అర్చకుడు.. మానసిక ఎదుగుదల లేని తన కుమారుడితో కలిసి ఆలయ కొనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన వరయూరు లక్ష్మీనర్సింహాచార్యులు(54) గ్రామ శివారులోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గత 20 ఏళ్లుగా పూజారిగా సేవలందిస్తున్నారు. ఆయన కుమారుడు పవనకుమారాచార్యులు(25) మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతూ తండ్రికి సహాయకుడిగా ఉండేవాడు.
ఇటీవల లక్ష్మీనర్సింహాచార్యుల భార్య శ్రీదేవి అనారోగ్యంతో ఏప్రిల్ 16న మృతి చెందింది. భార్య మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీనర్సింహాచార్యులు.. కుమారుడి భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తన జీవితం వ్యర్థమైందని, ఎప్పటికైనా కొడుకుతో కలిసి దేవుడి సన్నిధిలోనే ప్రాణాలు తీసుకుంటామని ఆయన స్థానికులతో పలుమార్లు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తండ్రీకొడుకులు ఆలయ కొనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం కొనేరులో వారి మృతదేహాలు తేలియాడుతూ కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లింగాలఘణపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక ఈ ఘటనలో మరో విషాదకర విషయం ఏమిటంటే.. లక్ష్మీనర్సింహాచార్యుల తల్లి కూడా సుమారు 15 ఏళ్ల క్రితం ఇదే కొనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు.

Post a Comment