ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసులు ఇద్దరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన పర్యాటకుల బస్సు ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. నైమిశారణ్యం దర్శించుకుని శ్రీరాముడి జన్మభూమి అయోధ్యకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం, బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తో పాటు టూరిస్ట్ గైడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ఒక్కసారిగా తిరగబడటంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నరసరావుపేటలో విషాద ఛాయలు
ఈ ఘటన వార్త తెలిసిన వెంటనే నరసరావుపేటలో ఆందోళన నెలకొంది. యాత్రకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆత్రుతతో బాధితుల క్షేమ సమాచారం కోసం అధికారులను సంప్రదిస్తున్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకురావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Post a Comment