-->

యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం?

యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం?


హైదరాబాద్, మే 22: తెలంగాణ రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచే మంత్రివర్గ సమావేశం ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది. వాస్తవానికి ఈ నెల 21న నిర్వహించాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో మే 23కు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ సమావేశం సాధారణంగా జరిగే హైదరాబాద్ సచివాలయంలో కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సమావేశం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

మే 23న యాదాద్రిలోని వేద పాఠశాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అదే సందర్భంగా మంత్రివర్గ సమావేశాన్ని కూడా అక్కడే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ పాలనను కేవలం రాజధాని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాలకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యాదాద్రి వంటి ప్రముఖ దేవస్థానంలో కేబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ సందేశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793