సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు ఎమ్మెల్యే కూనంనేని
సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం జూన్ రెండో వారం లోపు పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగాల్సి వస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
“సింగరేణిని ప్రభుత్వం పరిరక్షించాలి”
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తెలంగాణకు సిరులు కురిపించే సింగరేణి కొల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ను ప్రభుత్వం అన్ని విధాలా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం విడదీయరాని అంశాలని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం లాభాలపైనే దృష్టి పెట్టి కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని ఆరోపించారు. గతంలో ఆర్టీసీ పరిస్థితి ఎలా అయిందో, ఇప్పుడు అదే విధంగా సింగరేణిని కూడా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు.
నష్టాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఎప్పుడూ లాభాల్లో ఉండే సింగరేణి సంస్థ ప్రస్తుతం నష్టాల్లోకి వెళ్లడానికి గల కారణాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గిస్తూ, కాంట్రాక్ట్ కార్మికులతో తక్కువ జీతాలకు అధిక పని చేయించుకోవడం సరికాదన్నారు. కోల్ ఇండియా తరహాలోనే ఇక్కడ కూడా సమాన వేతనాలు అమలు చేయాలని కోరారు.
కార్మికులకు ఆరోగ్య సమస్యలు – వారసులకు ఉద్యోగాలపై ఆందోళన
సింగరేణి కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గతంలో మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం కారుణ్య నియామకాల పేరుతో ఆ అవకాశాలను కూడా నిలిపివేయడం అన్యాయమన్నారు. తక్కువ పెన్షన్లు పొందుతున్న కార్మికులకు ఆసరా పెన్షన్లు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
“సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది”
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం అధికమైందని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ జోక్యం ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ మరింతగా జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. దీంతో అవినీతి, అక్రమాలు పెరిగాయని పేర్కొన్నారు.
గతంలో ప్రతి రెండేళ్లకో కొత్త మైన్ కేటాయించేవారని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కొత్త మైన్ కూడా కేటాయించలేదని ఆరోపించారు. బొగ్గు తవ్వకాల పనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, మెడికల్ బోర్డును నిర్వీర్యం చేయడం, కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతోందన్నారు.
జూన్ రెండో వారం వరకు గడువు
కార్మిక సమస్యలపై ఇప్పటికే పలు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిందని తెలిపారు. ఆ సమావేశంలో యాజమాన్యానికి ఇచ్చిన సూచనలను జూన్ రెండో వారం లోపు అమలు చేయాలని, లేకపోతే సమ్మె తప్పదని యూనియన్ నేతలు హెచ్చరించారు.

Post a Comment