భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షోరూం దగ్ధం
Hyderabad నగరంలోని అసిఫ్‌నగర్ పరిధి కార్వాన్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎం.జే. ఫర్నిచర్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. క్షణాల్లోనే మంటలు షోరూం అంతటా వ్యాపించడంతో అక్కడ నిల్వ ఉంచిన ఫర్నిచర్ స్టాక్ పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.
మంటలు భారీగా ఎగిసిపడటంతో పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయితే ఘటన చోటుచేసుకున్న ప్రాంతం జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతం కావడం, వీధులు చాలా ఇరుకుగా ఉండటంతో ఫైర్ ఇంజిన్లు ప్రమాద స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో మంటలను అదుపు చేయడానికి కొంత సమయం పట్టింది.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment