మిడ్ మానేరు విషాదం.. ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది!
రాజన్న సిరిసిల్ల జిల్లా: మే 22: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
శుక్రవారం ఉదయం ఐదుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మిడ్ మానేరు జలాశయానికి ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన హరిచరణ్ గౌడ్ (18), చిర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మణికంఠ (17) నీటిలో మునిగి మృతి చెందారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం మణికంఠకు ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు స్నేహితుడు హరిచరణ్ గౌడ్ ప్రయత్నించగా, ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. వారితో పాటు వెళ్లిన మరో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment