తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ పెంపొందించే దిశగా ఈ మార్పులు తీసుకురానున్నారు.
కొత్త విధానం ప్రకారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా సెకండ్ ఇయర్‌కే పరిమితమైన ప్రాక్టికల్స్‌ను రెండు సంవత్సరాలకు విభజిస్తూ ప్రతి ఏడాదికి 15 మార్కుల చొప్పున కేటాయించనున్నారు.
అలాగే మ్యాథ్స్ బోధనలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థులు కేవలం సూత్రాలు కంఠస్థం చేయడం కాకుండా ప్రాక్టికల్ అర్థంతో నేర్చుకునేలా కొత్త పద్ధతులు తీసుకురానున్నారు.
ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానానికీ మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి విద్యా సంవత్సరానికి 15 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయించనున్నారు. దీంతో విద్యార్థుల నిరంతర ప్రతిభను అంచనా వేయడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
మ్యాథ్స్ సబ్జెక్టులో ఫైనల్ పరీక్షలను 75 మార్కుల బదులు 60 మార్కులకు నిర్వహించనుండగా, మొత్తం ఫైనల్ పరీక్షలను 100 మార్కుల బదులు 80 మార్కులకే నిర్వహించే విధంగా మార్పులు చేయనున్నారు.
భాషా విభాగాల్లో కూడా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ప్రవేశపెడుతున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషా సబ్జెక్టుల్లో 20 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మార్పులతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు, కాన్సెప్ట్ ఆధారిత అభ్యాసం పెరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment